గుంటూరులో పుట్టా.. ప్రజల కోసం ప్రాణమిస్తానన్న పవన్
గుంటూరులో పుట్టా.. ప్రజల కోసం ప్రాణమిస్తానన్న పవన్
గుంటూరులో పుట్టిన వాడిని… పౌరుషం గల వాణ్ణీ… ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరులోని ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్ లో నిర్వహించిన జనసేన శంఖారావం సభలోఆయన మాట్లాడారు. జనసేన పార్టీ పెట్టింది అధికారం కోసం కాదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలలో విజయం సాధించి జనసేన పార్టీ అసెంబ్లీలో అడుగు పెడుతుందని జనసేన అధినేత పవన్ ధీమా వ్యక్తం చేసారు. రాజకీయం చాల బాధ్యతగా, బలంగా చేయాలని కార్యకర్తలకు సూచించారు. వేల కోట్ల డబ్బు తన దగ్గర లేదని, అయినప్పటికీ బలమైన వ్యూహంతో ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు జనసేనాని చెప్పారు.అభిమానులను,కార్యకర్తలను ఎప్పుడూ మోసం చేయనని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు.
సీఎం చంద్రబాబు , ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లపై తనకు ఎలాంటి వ్యక్తిగత కోపాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తానన్నారు. ఉద్యోగాల కల్పన కోసం కొత్త పాలసీలు తీసుకువస్తామన్నారు. అవినీతి వ్యవస్థ నుంచే జనసేన పార్టీ వికసిస్తుందన్నారు పల్నాటి పౌరుషాన్ని గుండెల్లో నింపుకున్నానన్నారు. సంకల్ప బలం ఉంటే అన్ని సాకారమవుతాయన్నారు.
వ్యవస్థను మార్చడానికి నేను సిద్దం… మీరు సిద్దమా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్వేగపూరితంగా ప్రశ్నించారు. గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రి అధ్వాన్నంగా మారిందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందన్నారు. మేధావులు రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారన్నారు.. వ్యవస్థ సంపూర్ణంగా మారాలన్నారు. మాట ఇస్తే మడమ తిప్పనని జనసేనాని అన్నారు. కులాల పేరు చెప్పి రాజకీయ నాయకులు బాగుపడుతున్నారన్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అణగారిన వర్గాలకు, ఆడపడుచులకు అండగ నిలబడకపోతే జీవితం వ్యర్థమనిపించిందని పవన్ కల్యాణ్ అన్నారు.
Comments
Post a Comment