ఏపీ రాజకీయాలకి వస్తున్న కేటీఆర్ ?

ఏపీ రాజకీయాలకి వస్తున్న కేటీఆర్ ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెరాస ప్రత్యక్షంగా వేలు పెట్టడానికి సిద్ధమయిందనే సంకేతాలు నిన్న రాజభవన్ లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో బయటపడ్డాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే.. పలువురు ఆంధ్రా పారిశ్రామికవేత్తలకు కూడా ఆహ్వానం అందింది. అలాంటి వారు చాలా మంది… టీఆర్‌ఎస్ విషయంలో తమ భయభక్తులను బాగానే ప్రదర్శించారు. కొంత మంది.. టీఆర్ఎస్ రంగు .. గులాబీ రంగు కోటుతో ఎట్ హోం కార్యక్రమానికి హాజయ్యారు. కేటీఆర్‌తో మరింత పరిచయం పెంచుకుని.. సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. అలాంటి వారిలో విశాఖపట్నానికి చెందిన పారిశ్రామికవేత్త సన్యాసిరావు కూడా ఉన్నారు. సన్యాసిరావు గులాబీ కోటుతో రాజ్‌భవన్‌కు వచ్చారు. వచ్చినప్పటి నుంచి కేటీఆర్‌తో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించారు. ఆయనను కేటీఆర్ మరితం ఉత్సాహపరిచారు. ఏపీలో టీఆర్‌ఎస్‌ టికెట్‌తో పోటీ చేయమని ఆఫర్ కూడా ఇచ్చేశారు. ఇంకా ఎవరితో ఇలా మాట్లాడారో కానీ, సన్యాసిరావుతో మాట్లాడింది మాత్రం మన మీడియా మిత్రుల చెవుల్లో పడింది. అయితే సన్యాసిరావు ఉత్సాహన్ని చూసి, కేటీఆర్ అలా అన్నారేమో అన్న అభిప్రాయం చాలా మందిలో ఏర్పడింది. కానీ ఇటీవలి రాజకీయ పరిణామాల్ని చూస్తే మాత్రం కేటీఆర్ అన్నది వ్యంగ్యం కాదని అర్థం చేసుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామన్న కేటీఆర్.. తెలంగాణలో టీడీపీ పోటీ చేయగా లేనిది.. తాము ఏపీలో ఎందుకు పోటీ చేయకూడదన్న వాదన వినిపిస్తుంది. ఈ క్రమంలో ఆయన ఏపీలోనూ పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో.. జగన్‌ తో చర్చలు జరుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి నైతికంగా మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. టీఆర్ఎస్ పోటీ వల్ల.. తెలుగుదేశం పార్టీకి వొక్క ఓటు తగ్గే అవకాశం ఉన్నా… పోటీ చేయడం ఖాయమనే అంచనా ఉంది.
ఏపీలో కులాల్ని చూసి ఓటు వేస్తారని కేటీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే వెలమ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న చోట.. టీఆర్ఎస్ అభ్యర్థుల్ని.. నిలబెట్టి.. ఏపీలోనూ.. తమ పార్టీకి ఆదరణ ఉందని నిరూపించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై.. త్వరలోనే… క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే.. టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఏపీలో పోటీకి పెట్టరనే విషయాన్ని మాత్రం.. ఖండించే అవకాశం కనిపించడం లేదు. ఎంతో కొంత చాన్స్ ఉన్నట్లే రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Comments